Thursday, 12 July 2018

భాగవతం -- 57



                                    భాగవతం


భాగవతం -- 57

మళ్ళీ పాలసముద్రమును చిలకడం మొదలుపెట్టారు. ఇపుడు అందులోంచి ఒక తెల్లటి గుఱ్ఱము ఒకటి బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అంటారు. ఈ గుఱ్ఱమును చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకిమ్మనమని అడిగాడు. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. ఇపుడు పాల సముద్రంలోంచి బ్రహ్మాండమయిన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి అయిదవతనం తరగదు. దానిమీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలముల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది. ఈ కల్ప వృక్షమును ముందు ఇంద్రునికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై, దేవ నర్తకీ మణులై ఉండిపోయారు. తరువాత పాల సముద్రమును ఇంకా చిలకడం మొదలు పెట్టారు. ఇప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగబోతోంది. ఆమె శుక్రవారం పంచమి నాడు పుట్టింది.


పచ్చటి కాంతితో, తెల్లటి వస్త్రములు కట్టుకుని ‘పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే’ అని నల్లని కన్నులతో సొగసయిన చూపులతో మాతృ వాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకూ దరిద్రములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు విన్నారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశితుంది. ఇది పరమ యధార్థం. పుడుతూనే ఆ తల్లి యవ్వనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాస భాగవతంలో లేదు. కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒకమాట చెపుతారు. ఈ స్తోత్రమును చెయ్యడానికి కొన్ని రోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసికానీ, తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలమును శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగి ఉంది. కబరీ బంధం చుట్టూ చక్కటి మల్లెపువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, అలంకరించుకుని వుంది. మెడనిండా హారములు వేసుకుని ఉంది. వరదముద్ర పట్టి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తోంది. రెండు పాదములను కలిపి పద్మాసనం వేసుకుని ఉంది.

నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః
కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః!!

పద్మ పత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః!!

సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః
హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై చ నమోనమః!!

కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చ౦ద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే!!

స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమోనమః!!

యథామాతా స్తనా౦ధానా౦ శిశూనా౦ శైశవే సదా
తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః!!

(శ్రీ దేవీ భాగవతం – 9వ స్కంధము)

పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకము నందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కులేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా! ఆనాడు బిడ్డడయినందుకు అమ్మ పాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకములకు తల్లివయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును యిచ్చి కాపాడు’ అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు. ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు. అనుభవైకవేద్యము. పరమాత్మ శక్తితో కూడినవాడై అనుగ్రహిస్తాడు. ప్రక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు?


ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇపుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజూ “లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం” అని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఇపుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని దేవేంద్రుడు ఒక మణిమయ పీఠమును తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దానిమీద కూర్చుంది. ఇపుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్ళు తీసుకు రావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలాకాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి. అటువంటి పల్లవములను భూదేవి తెచ్చి యిచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నాన క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రములు చెప్తూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదం మంత్రములను చదువుతున్నారు. ఇప్పుడు మంగళ ధ్వనులు జరగాలి. లక్ష్మీ దేవి మంగళ స్నానానికి మేఘములు మంగళ ధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు.


అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆరోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో బాటు ఒక రవికల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలిలేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితుడయిన స్నేహితుడు ఉంటాడు. ఆయనన్ ‘సుహృత్’ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రములో వున్న వరుణుడే సుహృత్. అటువంటి సుహృత్ అమ్మవారు వేసుకుందుకు వైజయంతీ మాలను ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు హారములు నగలు వీటినన్నిటిని ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీ దేవి ఒక మంచి తారహారమును ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామరపువ్వును ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీఃపూర్వకమయిన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ ‘అమ్మా! లక్ష్మీ నీవు ఎల్ల లోకములకు ఏలిక రాణివై పరిపాలించెదవు గాక! అని ఆశీర్వచనం చేశారు.


ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఇపుడు దండ పట్టుకుని ఎవరి మెడలో వేయాలి అని బయలుదేరుతోంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్నెపిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తునకంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే వారు దరిద్రులయిపోయారు. వాళ్లకి అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతాడు. మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకి ఎంత అమూల్యమయిన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇపుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో వున్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనే పుట్టుమచ్చ మెరుస్తోంది.


🙏🙏 || ఓం నమో భగవతే వాసుదేవాయ || 🙏🙏




భాగవతం -- 56



                                    భాగవతం



భాగవతం -- 56

పామును మందరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మందరపర్వతమును గిరగిర తిప్పెస్తున్నారు. అపుడు వాసుకి ‘మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి’ అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మందర పర్వతం జారి క్రిందపడిపోయింది. ఇపుడు అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ దిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మందరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానే ఆధారమయి, మందరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మము నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములనన్నిటిని జీర్ణము చేసుకొనగలదు. అటువంటి వాడై ఆది కూర్మమై పాలసముద్రం క్రింద పడుకున్నాడు. ఇపుడు మందరపర్వతమును ఆదికూర్మం భరిస్తోంది. మరల మందరపర్వతమును వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు దేవతలు తోకవైపు ఉండి, మరల చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు.

ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావ సమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటకు వచ్చి ఏమిటి ఈ చప్పుడు? అన్నారు. అక్కడి వాళ్ళు స్వామీ, పాలసముద్రమును చిలుకుతున్నారు. అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు. బ్రహ్మగారు కూడా పైనుంచి క్రిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు. హాలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాలసముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో వుండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంది. అది వెంట తరుముతుంటే దేవతలు రాక్షసులు అందరూ వాసుకిని వదిలిపెట్టి పరుగు మొదలు పెట్టారు. అన్ని లోకములలో అగ్నిహోత్రం ప్రబలి పోతున్నది. పరుగెత్తి పరుగెత్తి కైలాసపర్వతం మీద వున్న పరమశివుని అంతఃపురము దగ్గరకు వెళ్ళి అక్కడి ద్వారపాలకులు అడ్డు పెట్టగా వారిని పక్కకు తోసివేసి లోపలి ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీరి అరుపులు విని స్వామి ఏదో ఆపద సంభవించి ఉండవచ్చునని బయటకు వచ్చారు. వారు శంకరునితో ‘ఈశ్వరా! నీవు ఈ విశ్వమంతా నిండి నిబిడీ కృతమయిన వాడివి. నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాము. ఇంట్లో ఏదయినా శుభకార్యం చేస్తున్నప్పుడు మనకొక సంప్రదాయం ఉన్నది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. కానీ దేవదానవులు ఆ పని చేయలేదు. స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ‘మేము మందరపర్వతం పెట్టి సముద్రమును చిలికితే హాలాహలం జనించింది. లోకములను కాల్చేస్తోంది. దయచేసి దానిని నీవు స్వీకరించవలసినది’ అన్నారు.

మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు !
భేదమగుచు దుది నభేదమై యోప్పారు బ్రహ్మమవగ నీవ ఫాలనయన !!

నీవు భూతభవిష్యద్వర్తమానరూపములలో ఉంటావు. నీవే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమయిన మూలపురుషుడవు కనుక ఈశ్వరా, ఈ హాలాహలమును నీవు పుచ్చేసుకో’ అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీ దేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. శంకరుడు ఆమెవంక చూసి.

‘కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై
యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; గాదె గీర్తి మృగాక్షీ !!

ఈ ఘట్టము వినిన వాళ్లకి కొన్ని కోట్ల జన్మల వరకు అయిదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళ సూత్రం గురించి వస్తుంది. ‘చూశావా పార్వతీ, నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు అన్నవాడు బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్ళను రక్షించాలని అనుకుంటున్నాను’ అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు తల్లి. మాతృత్వము ఒక్కొక్కసారి భర్తృత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమెలోంచి ఉద్భుదం చేస్తున్నాడు శంకరుడు. ‘మీ అన్నయ్య స్థితికారుడు. లోకముల నన్నిటిని నిలబెట్టాలి. ఇపుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోష పెట్టాలి కదా! అందుకని నేను హాలాహలమును త్రాగేస్తాను.

శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ !
రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ !!

నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. అది నా దివ్యమయిన లీల. నాకేమయినా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు’ అన్నాడు. అపుడు పార్వతీ దేవి ‘సరే, మీకు ఎలా ఇష్టమయితే అలా చేయండి’ అంది.

మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్ !
మ్రింగు మనె సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !!

ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషం అని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమనీ తెలుసు. త్రాగుతున్న వాడు తన భర్త అనీ తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ. అందుకని తాగెయ్యమంది. శంకరుని జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళ సూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే హాలాహలమునకు ఎదురువెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండచేసి నేరేడు పండంతచేసి గభాలున నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మ్రింగినప్పుడు కానీ వేడిచేసి ఆయన ఒంటిమీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్న వాడు హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మ్రింగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది.

ఉదరము లోకంబులకును సదనంబాగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం !
గుదురుకొన గంఠబిలమున బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫలరసము క్రియన్ !!

మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకీ వదలలేదు, క్రిందకీ వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీ దేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటినుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. ‘నీలకంఠా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహాల భక్షణం కథ వీనిన వాళ్లకి మూడు ప్రమాదములు జరుగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహలభక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు.

మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరకి వెళ్ళిపోయారు.క్షీరసాగరమథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామదేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమయిన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి. అపుడు దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. అందుకని కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారు దానిని పుచ్చుకున్నారు.

🙏🙏 || ఓం నమో భగవతే వాసుదేవాయ || 🙏🙏



భాగవతం -- 55




                               భాగవతం


భాగవతం -- 55

క్షీరసాగర మథనం

పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములనన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగాలాలసతకు గాని, వైభోగమునకు కాని, ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము.


ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని. శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ వున్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాసో మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది.


ఆ పారిజాత పుష్పమును ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘మహానుభావా, ఈ పుష్పమును స్వీకరించండి’ అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. దీనిని ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అద్దుకుని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తలమీద కానీ చెవిలో కానీ పెట్టుకోవచ్చు. లేదా ఎవరూ తొక్కని చోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమయిన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది దానిని స్వీకరించింది. అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అపుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడిని చూసి ‘నీవు ముకుంద పాదారవిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు. కనుక నీవు ఉత్తర క్షణం ఐశ్వర్య భ్రష్టుడవు అయ్యెదవు గాక! స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమయినటువంటి వైకుంఠములో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు’ అన్నారు. ఈమాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా! రాక్షసులు అందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇప్పుడు ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. అపుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అపుడు బ్రహ్మగారు ‘అప్పుడప్పుడు నీవు కండకావరంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్లావు. ఇవాళ దుర్వాసో మహర్షి జోలికి వెళ్లావు. అందువలన ఐశ్వర్యం పోయింది. ఇపుడు నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి’ అని కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నవాడి ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమునందు ద్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు.


అప్పుడు బ్రహ్మగారు అన్నారు ‘ఇప్పుడు నీకు ఐశ్వర్యము పోయినది కదా! నీవయినా నేనయినా మరల ఐశ్వర్యము నిమ్మని శ్రీమన్నారాయణుని అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నీవు విసిరేశావు.అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయనా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించే వాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దుర్వాసుని నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసిన వాడు తనకు ఎంత దగ్గర వాడయినా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు. శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వము కాని, శత్రుత్వము కానీ ఆవిష్కరింప బడుతుంది. ఇంద్రా! నేను కాని, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినపుడే. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం’ అన్నారు బ్రహ్మగారు.


ఆమాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది.పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది -హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు.తప్పు చెయ్యడం సహజం. పశ్చాత్తాప పడి మళ్ళీ ఆతప్పు చేయకుండా ఉండడం మంచి మనిషి లక్షణం. అపుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే! ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్లకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయిపోయాడు. అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. పరమాత్మ ప్రత్యక్షం అయ్యేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు.


శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. ‘నీవు ఐశ్వర్యము పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి! ఈ శరీరమునకు యవ్వనము పోకుండా మృత్యువు రాకుండా ప్రళయ కాలమునందు మాత్రమే మరల లీనమై ఎలా వార్ధక్యం రాకుండా ఐశ్వర్యం చెడకుండా అనారోగ్యం రాకుండా నిరంతరం తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఈయగలిగిన అమృతమును మీకు ఇస్తాను’ అని అన్నారు. అదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలచుకొని ‘నాది తప్పే మహానుభావా’ అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. ‘మీరు అనేక ఓషధులను తీసుకురండి. గడ్డి తీసుకురండి. పువ్వులు తీసుకురండి. ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. అపుడు మందర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. దానికి వాసుకిని త్రాడుగా చుట్టండి. దేవతలు, దానవులు దానిని అటుఇటు పట్టుకోండి. ఇపుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీమాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. వారిని క్షీర సాగర మథనమునకు తీసుకు వచ్చి సాగరమును చిలకండి. అపుడు అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది. అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరల చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు. నిగ్రహించుకొనండి. నేను ఇస్తే పుచ్చుకోండి. లేకపోతే ఊరుకోండి. ఎవరికీ ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అది వాడికి ఇస్తాను.


ఇపుడు దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తాం అని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇపుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవుకోలను తయారుచేసి ఇవ్వవలసినదని కోరారు. త్వష్ట ప్రజాపతి ఎందుకు? అని అడిగాడు. అపుడు దేవతలు ‘మేము మందర పర్వతమును కింద తవ్వేస్తాము. తరువాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవుకోలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మందరపర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. ఇపుడు మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని దాన్ని కొన్ని తాళ్ళు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద మందరపర్వతమును అందరూ కలిసి పైకి ఎత్తారు.అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దానికింద పడి కొందరు మరణించారు. అపుడు మిగిలిన వారందరూ ప్రక్కకు చేరి ఈ మందరపర్వతమును సముద్రము వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండునో’ అని అనుకున్నారు. వాళ్ళు ఈమాట అనుకునేసరికి బంగారు రంగులో ఉన్న గరుడ పక్షిమీద నుంచి శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగి దేవతలను ఓదార్చి మందరపర్వతమును బంతివలె నేర్పుతో చేతితో పట్టుకుని, దానిని తీసుకుని మరల గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాల సముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించి వేశాడు. చిలికేటప్పుడు వాసుకి శరీరం ఒరిసి పోకుండా మందరపర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకిని తీసుకు వచ్చి పర్వతమునకు చుట్టారు. ఇప్పుడు మందర పర్వతమును పాలసముద్రం లోకి పెట్టారు. ఇప్పుడు అది మునిగి పోకూడదు. అపుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకొనమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. అపుడు రాక్షసులు ‘మేము తోక పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాము’ అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకుని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకొనమని చెప్పారు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేటట్లు చేస్తుంది.



🙏🙏 || ఓం నమో భగవతే వాసుదేవాయ || 🙏🙏

భాగవతం -- 54



                                   భాగవతం


భాగవతం -- 54

అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!

ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమని దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు.


సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!


లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయానవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!

తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్!!

ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌముది, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు.


వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు. అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏడిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.

అడిగెదనని కడువడి జానూ, నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్
వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!

అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.


మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా భయపడి అవి ఆది కూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.


ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి.


మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదే సమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు.


ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్ర మోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. రోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.


🙏🙏 || ఓం నమో భగవతే వాసుదేవాయ || 🙏🙏



భాగవతం -- 53




                                    భాగవతం



భాగవతం -- 53

అష్టమ స్కంధము – గజేంద్రమోక్షం

గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. ‘గజ’ అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే ‘జగ’ అవుతుంది. ‘జ’ అంటే ‘జాయతే’. ‘గ’ అంటే ‘గచ్ఛతే’. ‘జాయతే’ అంటే వెళ్ళిపోవడం. ‘గచ్ఛతే’ అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని ‘జగము’ అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం.


గజముగా ఎందుకు చెప్పాలి? అంటే ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది. భూమినుండి చాలా తక్కువ ఎటు మాత్రము ఎగురలేని ప్రాణి ఏనుగు ఒక్కటే. ఏనుగు పైకి ఎగరలేక పోవడానికి దాని శరీరబరువే దానికి అడ్డు వస్తుంది. మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వ గతికి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువై ఉంటుంది. మగ్నత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది. నిజమునకు అది ఏనుగు కథా లేక మన కథా? నిజంగా మీరు ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్రమోక్ష కథను వింటే విశేషమయిన శుభ ఫలితం కలుగుతుందని ఆఖరున ఫలశ్రుతిలో చెప్తారు. నిత్య పారాయణము చేయవలసినది అని నిర్ణయింపబడిన కథ గజేంద్రమోక్ష కథ. అలాంటి గజేంద్రమోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు. వారికి అపారమయిన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథమును రచించారో వారు చెబుతారు. గజేంద్రమోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్రమోక్ష కథా శ్రవణము ఒక పూజకాదు, ఒక కర్మ కాదు.
పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నాడంటే ‘ఒకానొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును ఒక మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠము నుండి కదలివచ్చి రక్షించాడు’ అని తరువాతది చెప్పబోతున్నారు. అప్పుడు పరీక్షిత్తు ‘స్వామీ, ఏమిటా కథ? అంత విచిత్రంగా చెప్పారు” అన్నాడు. అపుడు శుకబ్రహ్మ పరీక్షిత్తు ఆర్తికి సంతోషించి గజేంద్రమోక్ష కథను చెప్పడం ప్రారంభించారు.


ఒకానొకప్పుడు క్షీరసాగరం ఉన్నది. అందు త్రికూటాచలం అనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతమును మూడు శిఖరములు ఉన్నాయి. ఒక శిఖరము బంగారముతోను, మరొక శిఖరము వెండితోను, మూడవది ఇనుముతోను చేయబడ్డాయి. అందు ఎన్నో రకముల వృక్షములు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఈ పరిసరములలో ఎన్నో రకములయిన జంతువులు ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ ఏనుగులు బయటకు వస్తే అరణ్యంలో ఒక్క పులి మిగలదట. చామరీ మృగములు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరములతో ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి. అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒకాయన ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఆ ఏనుగు ఆ మందకు రాజు. దానికి గల భార్యల సంఖ్య పదిలక్షల కోట్లు. జీవుడు ఒక్కడే కానీ ఎన్ని శరీరములో. ఈ పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయాడు. చాలా దూరం తిరిగాడు. నీటికోసం చాలా చోట్ల వెతికాడు. చిట్టచివరకు ఒక సరోవరం కనపడింది.


అద్భుతమైన సరోవరం - అదే సంసారం. దీని ఒడ్డున ఉండి నీరు త్రాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన పొంగిపోయి అబ్బ! ఈ సరోవరం ఎంత బాగుందో అనుకుని తన భార్యలతో అ నీళ్ళలోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్ళలోకి దిగింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది. తానెంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు. తాగడానికి వెళ్ళినవాడు నీళ్ళు తాగడం మానివేసి గట్టిగా పాదములను ఊన్చుకుని నిలబడిన వాడై విపరీతమయిన శక్తితో తొండం నిండా నీళ్ళు లాగాడు. ఆ నీటివేగంతో లోపలి చేపలు వెళ్ళిపోయాయి. మొసళ్ళు వెళ్ళిపోయాయి. ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒకసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంలో నిలబెట్టాడు. ఇప్పుడు ఊన్చుకుని తొండమును పైకెత్తి ఆ నీళ్ళను ఆకాశం మీదకి విసిరాడు. ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో వున్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయి. అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. మొసళ్ళు అన్నీ మకరరాశిలో పడిపోయాయి. అలా మూడు రాశులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు.



గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్ళు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయేసరికి నీరు బురద అయిపోయి అంతా కల్మషం అయిపొయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. గ్రహణంలో సూర్యుడిని పట్టినట్లు ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణము. దీనిని పట్టుకోవాలి అనుకుని తల పైకెత్తి చూసింది. భుగ భుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి నీటిని జిమ్మీ తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుగు కాలు ఎక్కడ ఉంటుందో పట్టేసుకుంది. మొసలి నీటి అడుగునుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతంగా మృత్యువు వస్తుంది. కాబట్టి మృత్యువు కాలును పట్టింది. ఇహ కదలడు. పట్టు విడిపించుకుందామని చూస్తోంది. ఇపుడు మిగిలిన కోరికలన్నింటినీ పక్కన పెట్టేసినట్లయితే ఏనుగుకి వున్న కోరిక ఒక్కటే. ఆ మొసలి పట్టు తప్పించుకుని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తోంది. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళలోకి లాగేద్దామని మొసలి చూస్తోంది. ఇప్పడు గజరాజుతో కూడివున్న మిగిలిన పరివారం ఏమి చేస్తున్నారు?

మకరితోడ బోరు మాతంగ విభుని నొక్కరుని దించి పోవ గాళ్ళు రాక
కోరి చూచుచుండె గుంజరీ యూధంబు మగలు దగులు గారే మగువలకును!!


ఈ పద్యం ఒక్కటి రోజూ స్మరణ చేసుకుంటే చాలు. వైరాగ్యం వస్తుంది. ఆయన మాతంగ విభుడు. గొప్ప ఏనుగు. ఈయన నీళ్ళల్లో యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారు యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టుమీద వుండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే వెయ్యేళ్ళు యుద్ధం చేసింది. అలా పట్టుకున్న మొసలి పట్టు తప్పుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటుంది “అయ్యో! భూమి మీద ఉంటే నాకు బలం. నిష్కారణంగా నీళ్ళలోకి ప్రవేశించాను. ఈ నీళ్ళలోకి ప్రవేశించిన తరువాత ‘నావారు’ అనుకున్న వారు వెళ్ళిపోయారు. ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడ నన్ను రక్షించే వారు ఎవరు?’ అని ఆ ఏనుగు అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇంతకూ పూర్వం అతడు చేసిన పుణ్యం పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకమునకు వచ్చింది.  పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మ్రుతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!!

ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కర్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో. ఎవరు అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!’ అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పది మూడుకోట్ల దేవతలు లేచి నిలబడ్డారు.

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు -
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్!!

లోకములు, దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటై పోయి నీరై పోయి ముద్దయి పోయి, గాడాంధకారం కమ్మేస్తే ఈ గాడాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు.


ఎటువంటి మహాపురుషుడయిన వాడు, తానొక్కడే ఉండి అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చెయ్యలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవరూ చెప్పలేరో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!” దేవతలు ఎవరి మటుకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారు. దేవతలు అలా కూర్చోవడంలో ఒక రహస్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ. మొసలిని చంపి రక్షించాలి. అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీమహావిష్ణువు. కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్నీ చెప్పి చివర ఒకమాట అంది.

కలడందురు దీనులయెడ గలడందురు పరమయోగి గణముల పాలం !
గలడందు రన్ని దిశలను గలడు కలండనెడి వాడు గలడో లేడో !!

ఇంతా చెప్తోంది కానీ దానికో అనుమానం. నిజంగా దీనులయిన వారు పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడు అని అంటారు. కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు కలదు కలండనెడివాడు కలడో లేడో! అంది. ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు.

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్ !!
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ !!
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!!

నీవు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా! వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమయిన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠము నుండి రావాలి.


🙏🙏 || ఓం నమో భగవతే వాసుదేవాయ || 🙏🙏